Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 14-2
సంపుటము: 1-84
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
వెలయు నిన్నియును [1]వృథా వృథా
తలఁపున శ్రీహరిఁ దడసినను
॥వెలయు॥
ఎడయని పుణ్యము లెన్నియైనా
విడువక సేయుట వృథా వృథా
బడిబడి నే శ్రీపతి నాత్మలోఁ
దడవక యితరము దడవినను
॥వెలయు॥
యెరవుల తపముల నెంతైనా
విరవిర వీఁగుట వృథా వృథా
హరి నచ్యుతుఁ బరమాత్మునిని
మరచి తలఁచక మఱచినను
॥వెలయు॥
దైవము నెఱఁగక తమకమున
వేవేలైన వృథా వృథా
శ్రీవేంకటగిరి చెలువునిని
సేవించక మతిఁ జెదరినను
॥వెలయు॥

[1] ‘వ్రిథావ్రిథా’ అని అంతటా రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము