శృంగార సంకీర్తన
రేకు: 873-6
సంపుటము: 18-437
రేకు: 873-6
సంపుటము: 18-437
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
మఱఁగులేఁటి కింతట మన్నించవయ్యా చిఱుత నీ సేసలు చిత్తగించవయ్యా | ॥పల్లవి॥ |
మచ్చువేసి మాటలాడి మగువను వలపించి రచ్చలఁ బెట్టితి వింక రావయ్యా యిచ్చకములే సేసి యీవిగా మోవి యొసఁగి లచ్చనలు నించితి వెల్లవారు నెరిఁగిరి | ॥॥ |
నయగారాలెల్లాఁ జూపి నంటున నవ్వులు నవ్వి దయతోఁ బెండ్లాడితివి తలఁచవయ్యా ప్రియములు పచరించి బిగువుఁజన్నులు ముట్టి క్రియలు మరిపి సిగ్గు బయలుసేసితివి | ॥॥ |
చూపులనే యాసరేఁచి సొమ్ములు మేనఁ బెట్టి తీపులనే కూడితివి తెలియవయ్యా యేపున శ్రీ వేంకటేశ యిన్నిటా నేర్పరిఁ జేసి చేపట్టితి విందుకు నీచెలులు మెచ్చేరు | ॥॥ |