అధ్యాత్మ సంకీర్తన
రేకు: 14-3
సంపుటము: 1-85
రేకు: 14-3
సంపుటము: 1-85
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
ఇలయును నభమును నేకరూపమై జలజల గోళ్ళు జళిపించితివి | ॥ఇలయును॥ |
ఎడసిన నలముక హిరణ్యకశిపునిఁ దొడికిపట్టి చేతుల బిగిసి కెడపి తొడలపై గిరిగొన నదుముక కడుపు చించి కహకహ నవ్వితివి | ॥ఇలయును॥ |
రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు గుప్పుచు లాలలు గురియుచును కప్పిన బెబ్బులి కసరు హుంకృతుల దెప్పరపసురల[1] ధృతి[2] యణఁచితివి | ॥ఇలయును॥ |
పెళ పెళ నార్చుచుఁ బెడబొబ్బలిడుచు థళథళ మెఱువఁగ దంతములు ఫళఫళ వీరవిభవ రసరుధిరము గుళగుళ దిక్కుల గురియించితివి | ॥ఇలయును॥ |
చాతిన ప్రేవుల జన్నిదములతో వాతెర సింహపు వదనముతో చేతులు వేయిటఁ జెలగి దితిసుతుని పోతర మణఁపుచు భువి మెరసితివి | ॥ఇలయును॥ |
అహోబలమున నతిరౌద్రముతో మహామహిమల మలయుచును తహతహ మెదుపు[3]చుఁ దగు వేంకటపతి యిహముఁ బరముఁ మా కిపు డొసఁగితివి | ॥ఇలయును॥ |
[1] ‘ధ్రితి’ అని రేకు.
[2] నిడురేకు 10- దిటమణ.
[3] నిడురేకు 10- లెడపుచు.