Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 14-4
సంపుటము: 1-86
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఇతరము లిన్నియు నేమిటికి
మతి చంచలమే మానుట పరము
॥ఇతరము॥
ఎక్కడి సురపుర మెక్కడి వైభవ-
మెక్కడి విన్నియు నేమిటికి
యిక్కడనే పరహితమునుఁ బుణ్యము
గక్కునఁ జేయఁగఁ గల దిహపరము
॥ఇతరము॥
యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు-
లెవ్వ రిందరును నేమిటికి
రవ్వగు లక్ష్మీరమణునిఁ దలఁపుచు
యివ్వలఁ దాఁ సుఖియించుట పరము
॥ఇతరము॥
యెందరు దైవము లెందరు వేల్పులు
యెంద రిందురును నేమిటికి
కందు వెఱిఁగి వేంకటగిరిరమణుని
చిందులేక కొలిచిన దిహపరము
॥ఇతరము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము