Display:
శృంగార సంకీర్తన
రేకు: 902-1
సంపుటము: 19-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
ఏమనేమయ్య నీవు యేలికవు మాకునెల్లా
ఆమనిగా మోవి చూపి యాస రేఁచేవు
॥పల్లవి॥
ఇచ్చకములే సేసి యెలయించి యెలయించి
పచ్చిదేర నింతులను భ్రమయించేవు
ముచ్చటలాడి కడు మోహములు పైఁజల్లి
మెచ్చులుగా వలపించి మేకులు సేసేవు
॥॥
సందడిఁ జేతులు చాఁచి జవ్వనము లంటియంటి
మంద పెండ్లి కూఁతులను మరిగించేవు
విందులవీడెము లిచ్చి వేసాలు గడునెరపి
యిందులోనే యేకతాన యెమ్మెల మించేవు
॥॥
నమ్మిక లెన్నైనా నిచ్చి నగవులు పచరించి
మమ్ము నిందరినిఁ గూడి మన్నించేవు
నెమ్మది శ్రీవేంకటేశ నేరుపులు పచరించి
నిమ్మపండు చేతికిచ్చి నీటులు చూపేవు
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము