Display:
శృంగార సంకీర్తన
రేకు: 914-6
సంపుటము: 19-78
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళవసంతం
ఎంత కాకు సేసేవు యింతుల నింతేసి నీవు
వంతులు వెట్టుక యేమి వల్లె వేసేవు
॥పల్లవి॥
కందువ మర్మములంటి గజరుఁదనము చూపి
యెందరితో నవ్వు నవ్వి యెలయించేవు
చిందేటి మోవితేనెలు చిమ్మి రేఁచి చవిగొని
విందుల వలపులెట్టు వెదచల్లేవు
॥॥
చన్నులపైఁ జేయి వేసి జాణతనములు చూపి
యెన్నికతలఁ గరపే విందరి నీవు
వెన్నెలనవ్వు నవ్వించి వేడుకలు చిత్తగించి
పన్నిన మాయల నెట్టు భ్రమయించేవు
॥॥
కాతరాలు వుట్టించి కాగిటను బిగియించి
యేతుల నెందరి గుండే వింపుల నీవు
యీతల శ్రీ వేంకటేశ యిట్టె నన్ను గూడితివి
జాతుల నెందరిపై సేసలు వెట్టేవు
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము