Display:
శృంగార సంకీర్తన
రేకు: 917-5
సంపుటము: 19-89
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఘనుఁడైనవాని నింత కాకు సేతురా
మనసునఁ బెట్టుకొని మంతనము లాడవే
॥పల్లవి॥
అంగనలు కొలువు సేయఁగ నుండేరమణుని
వెంగెములాడకువే వేమారును
సింగారించుక యద్దము చేతఁబట్టి చూడఁగాను
చెంగట నాతనిమై మచ్చములు చూపకువే
॥॥
చెప్పరానిబాసలెల్లాఁ జేసేటిమగవానిఁ
దప్పులెల్లా నెంచకువే తగవు గాదు
ముప్పిరివల్లెవాటుతో మురిపెముచూపేవాని
దుప్పటిపసపు చూపి దూరులు సేయకువే
॥॥
చేరి కాఁగిలించుకొన్న శ్రీ వేంకటేశ్వరుని
నేరము లెంచకువే నీకుఁ దగదు
కూరిమితో నిను వేఁడుకొంటా నుండేటివాని-
తారుకాణచేఁతలెల్లాఁ దలఁపు సేయకువే
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము