Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 14-6
సంపుటము: 1-88
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఎందాఁక నేచిత్త మేతలఁపో
ముందుముందు వేసారితి ములిగి వేసారితి
॥ఎందాఁక॥
ఏమిసేతు నేడచొత్తు నేమని బోధింతును
నా మాఁట విన దిదే నా విహారము
[1]యేమరినాఁ దలఁపించీ నేమైనా గడించీ
సాముసేసి వేసారితి జడిసి వేసారితి
॥ఎందాఁక॥
యేడ చుట్టా లేడ బంధు లేడ పొందు లెవ్వరూ
తోడైనవారుఁ గారు దొంగలుఁ గారు
కూడుచీరగాని చోటై కొరగాని పాటై
వాడివాడి వేసారితి వదిలి వేసారితి
॥ఎందాఁక॥
యెందునున్నాఁ డేమిసేసీ నెక్కడ భోగించీని
విందులకు విందయిన వేంకటేశుఁడు
యిందరి హృదయములో నిరవై యున్నాఁ డతఁడు
చెంది నన్నుఁ గాచుఁ గాక చెనకి వేసారితి
॥ఎందాఁక॥

[1] ‘ఏమరిన’ అని రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము