Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 15-1
సంపుటము: 1-89
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఊరికిఁ బోయెడి [1]వోతఁడ కడు-
చేరువ తెరు వేఁగి చెలఁగుమీ
॥ఊరికి॥
ఎడమ తెరువువంక కేఁగిన దొంగలు
తొడిఁబడ గోకలు దోఁచేరు
కుడి తెరువున కేఁగి కొట్టువడక మంచి-
నడిమి తెరువుననే నడవుమీ
॥ఊరికి॥
అడ్డపుఁ దెరువుల నటునిటుఁ జుట్టాలు
వెడ్డు వెట్టుచు నిన్ను వేఁచేరు
గొడ్డేరే చిన్నదిడ్డి తెరువు వోక
దొడ్డ తెరువువంక తొలఁగుమీ
॥ఊరికి॥
కొండ తెరువు కేఁగి కొంచపు సుఖముల
బండై తిరుగుచు బడలేవు
అండనుండెడి పరమాత్ముని తిరుమల-
కొండ తెరువు తేఁకువ నేఁగుమీ
॥ఊరికి॥

[1] ‘ఓ+అతఁడ’ = ఓ మనిషీ.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము