Display:
శృంగార సంకీర్తన
రేకు: 957-6
సంపుటము: 19-330
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళం
సరసములాడఁగానే సరి వయసు వోయీని
తెరమరఁ గిఁకనేల దిష్టించరాదా
॥పల్లవి॥
చిత్తరున వ్రాసినట్టుసిగ్గువడున్నది చెలి
యెత్తి కాఁగిలించుకోవు యింతగలదా
కొత్తమెరుఁగువలెను కొంకుదేరదు వెరచి
పొత్తుకుఁ బిలుచుకొని బుజ్జగించరాదా
॥॥
అంచవలెఁ బొలసీని అంగన నీ యెదుటను
మంచముమీఁదికిఁ దీసి మన్నించరాదా
అంచల పూఁగొమ్మవలె నాడనుండే జడసీని
మంచితనములు నేని మాటలాడరాదా
॥॥
మూసినముత్యమువలె మోనముతో నవ్వీని
సేసవెట్టి రతివిందు సేయఁగరాదా
ఆల శ్రీవేంకటేశ అంగన నిన్నిటుగూడె
వాసికెక్కె మీ వలపు వద్దనుండరాదా
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము