Display:
శృంగార సంకీర్తన
రేకు: 958-3
సంపుటము: 19-333
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
నీకుఁ దెలియదు గాని నిండిన నాలోని కాఁక
కాకు సేయకుండరాదా కమ్మరాఁ గొంతవడి
॥పల్లవి॥
నాకంటే మునుప నీవు నన్ను మాటాడించఁగాను
పైకొన్న మొగమోట నేఁ బలికేఁగాని
చేకొని నీ వాడానీడాఁ జేసినచేఁతలు విని
కూకులు వత్తులునాయ కొలుపదు మనసు
॥॥
మొగమిచ్చి సారెసారె మోహము చల్లుచు నాతో
నగఁగా నేనూ నట్టె నవ్వేఁగాని
యెగసక్కేలకు నీమై నెవ్వతోచేఁతలు చూచి
సగమై లోలో నిట్టె జడిసీ నాదేహము
॥॥
దగ్గరఁగ వచ్చి నీవు తగఁ గాఁగిలించఁగాను
వొగ్గి నేనూఁ గూడి వూరకుండితిఁ గాని
యెగ్గులేక శ్రీవేంకటేశ నన్నుఁ గూడఁగాను
సిగ్గుచేత నాచెక్కు చేతిమీఁద మోఁచేను
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము