Display:
శృంగార సంకీర్తన
రేకు: 964-1
సంపుటము: 19-367
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
విరహంబు వేఁడాయ విరుల మొన వాఁడాయ
తరవాతి పనుల కిటు తడవేల ఇఁకను
॥పల్లవి॥
పిలువరే నాయకునిఁ బ్రేమంపుచెలిమీఁద-
నలఁదరే శ్రీగంధ మందాఁకాను
నిలువరే కొంతవడి నిండురొద లిటు మాని
కలికిమై చెమరించెఁ గంద మిఁకఁ బనులు
॥॥
చెరుగరే తురుములోఁ జెదరిజారిననెరులు
కరఁగెనే చెలినుదటికస్తూరిబొట్టు
మరుపరే కప్పురము మగువదప్పులు దీర
నెరపుదము నేరుపులు నిమిషంబుమీఁద
॥॥
అంపరే యెదురుగా నతనికిఁ గానుకలు
చెంపలనుఁ బన్నీరు చిలుకఁగదరే
యింపులను శ్రీవేంకటేశుఁడిదె వచ్చి సతి
సొంపులను గూడె నిఁక సొలయ నేమిటికే
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము