Display:
శృంగార సంకీర్తన
రేకు: 1000-5
సంపుటము: 19-586
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఎంతటివాఁడవౌ(డౌ?)తా నెఱఁగ వీతని నీవు
ఇంతట నీ పతియైతే నిటు సేయఁ జెల్లునా
॥పల్లవి॥
పుప్పొడి చల్లఁగదమ్మ పూఁచి నీవెంట రాఁగాను
చిప్పిల నీపతిమేను చెమరించెను
కప్పుర మియ్యఁగదమ్మ కడు నీతో మాటాడఁగా
దప్పిదేరీఁ గెమ్మోవి తగఁ జూడరాదా
॥॥
పచ్చడము గప్పవమ్మ బడి నీపై నొరగఁగా
పచ్చిదోఁచి గరుపారెఁ బతిమేనెల్లా
మెచ్చి కొప్పువెట్టవమ్మ మేరమీరీ నీపనులు
ఇచ్చకానకుఁ జేయఁగ నిదె వీడెఁ దురము
॥॥
తూఁగుమంచ మూఁచవయ్య తుద శ్రీ వేంకటేశుఁడు
కాఁగిట నిన్నుఁ గూడి కడు నలసె
ఆఁగి ముచ్చటాడవమ్మ అట్టె నీవద్ద నుండఁగా
మూఁగినరతుల మేనుమఱచియున్నాఁడు
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము