Display:
శృంగార సంకీర్తన
రేకు: 1001-2
సంపుటము: 20-2
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
నీ వొకటి దలఁచఁగా నేరుపు వేరొకటాయ
యీవిధము సరిగాదు యేమి సేసేవే
॥పల్లవి॥
చన్నులంటాఁ బెంచితివి జక్కవలాయ నివె
కన్నెరో పయ్యదనేల కుప్పేవే నీవు
ఇన్ని నెరులంటా దువ్వే వివియుఁ దుమ్మిదలాయ
యెన్నినట్టు రాదాయ నేమి సే సేవే
॥నీ వొకటి॥
చొక్కపు నీకన్నులంటాఁ జూడఁబోతే నమ్ములాయ
తక్కరిరెప్పలనేల దాఁచుకొనేవే
తొక్కేవు పాదములంటాఁ దొలుతే తామరలాయ
యెక్కడౌతా నెఱఁగవు యేమి సే సేవే
॥నీ వొకటి॥
నడుమంటాఁ బట్టితివి నాఁడే బట్టిబయలాయ
వడి నందునేల పోఁకముడి వే సేవే
యెడయక శ్రీవేంకటేశుఁడ నేఁగూడితిని
యెడపు విన్నిముఁ దేరె నేమి సే సేవే
॥నీ వొకటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము