Display:
శృంగార సంకీర్తన
రేకు: 1001-3
సంపుటము: 20-3
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
కోరినట్టే నీకుఁ జెల్లె గోవిందుఁడా మా-
కూరిములు మాకు దక్కె గోవిందుఁడా
॥పల్లవి॥
కొలనికఱుత నీవు గోవిందుఁడా! మము
గులుగురేఁచకువోయి గోవిందుఁడా
కొలముఁ గొలముఁ గూడె గోవిందుఁడా! ఇంత
కులికి నవ్వకువోయి గోవిందుఁడా
॥కోరి॥
కోకలేల తీసితివి గోవిందుఁడా! నీకుఁ
గోకో ఇదివో మొక్కు గోవిందుఁడా
గోకులమిందరిలోన గోవిందుఁడా! సిగ్గు
కూకులు వత్తులు నాయ గోవిందుఁడా
॥కోరి॥
కొప్పు దాఁకించకువోయి గోవిందుఁడా! మా
కుప్పెసవరము వీడీ గోవిందుఁడా
గొప్ప శ్రీవేంకటగిరిగోవిందుఁడా! మేలు
కుప్పళించి కూడితివి గోవిందుఁడా
॥కోరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము