Display:
శృంగార సంకీర్తన
రేకు: 1004-4
సంపుటము: 20-22
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
కాంతుని వలపు నేనే కన్నదాఁకాను
చెంతల నన్ను బలిమి సేయకురే చెలులు
॥పల్లవి॥
దగ్గరివచ్చినదాఁకా దవ్వుల నుండుటే చవి
సిగ్గులు దేరినదాఁకా చింతలే చవి
బగ్గన నవ్వినదాఁకా పంతపుమోనమే చవి
వొగ్గి నన్నుఁ బిలువకుండరాదా చెలులు
॥కాంతు॥
తెంకికి వచ్చుదాఁకా సాదింపఁజూపలే చవి
మంకు దీరుదాఁకా నెడమాటలే చవి
సంకె దీరునందాఁకా సరసములే చవి
అంకెకు రమ్మని నన్ను నంటకురే చెలులు
॥కాంతు॥
మనసు గలయుదాఁకా మచ్చరములే చవి
తనివిఁ బొందినదాఁకా తాపమే చవి
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ నేఁడు
పెనఁగి నన్నింకా రట్టుపెట్టకురే చెలులు
॥కాంతు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము