Display:
శృంగార సంకీర్తన
రేకు: 1043-3
సంపుటము: 20-255
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఏమి సేతు నిఁక నేను యేమి సేతు
వాములైన తననవ్వు వద్దనేమా
॥పల్లవి॥
అప్పుడే తా రాకుండఁగ నలుగఁగఁ బోతేను
యెప్పటి పతిచిత్తము యెంతనొచ్చునో
దప్పిదేరి తనమోము దప్పకచూడఁబోతేను
చిప్పిల లోలో నెంతసిగ్గువడునో
॥ఏమి॥
కడుఁగాఁక తనమేను గాఁగిలించఁబోతేను
యెడసి మదనరేక లేడ రేఁగునో
జడియ కాతనితోనే సరస మాడఁగఁబోతే
వెడఁగుఁదనాల నెట్టి వెంగెములై తోఁచునో
॥ఏమి॥
మించిన రతికేలిని మేను మఱపించఁబోతే
నించుకంత దెలిసి నన్నేమనునో
అంచల శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్నుఁగూడె
నెంచరాని తలపోఁత లేమి దలఁచునో
॥ఏమి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము