Display:
శృంగార సంకీర్తన
రేకు: 1043-5
సంపుటము: 20-257
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
అప్పటి కప్పుడే చెప్పే మందుకేమి
వొప్పులుఁ దప్పులు నీకే వొప్పగించేమయ్యా
॥పల్లవి॥
కన్నుల జంకెలు గొన్ని కారపు బొంకులు గొన్ని
నిన్నటనుండి పడేము నీచేతను
వెన్నెల నగవు గొంత వేసాల తగవు గొంత
యెన్నిచెప్పీనా మాన విఁకఁ జూడవయ్యా
॥అప్పటి॥
పచ్చిమాఁట లోకకొన్ని వెచ్చినమాఁటలు గొన్ని
నిచ్చనిచ్చఁ బడలేము నీచేతను
వచ్చి సన్న సేసేవు వలపసలే పూసేవు
మెచ్చుగాదన్నాఁ బోవు మేరమీరేవయ్యా
॥అప్పటి॥
మోనపుతిట్లు గొన్ని మోహపుటొట్లు గొన్ని
నేనే లోనైతిఁగా నీచేతను
కానీలే శ్రీవేంకటేశ కాఁగిటఁ గూడితి నన్ను
మానరానిపొందులాయ మఱియేఁటికయ్యా
॥అప్పటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము