Display:
శృంగార సంకీర్తన
రేకు: 1043-6
సంపుటము: 20-258
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
పొద్దువో దతఁడు పొందు లెఱఁగఁడు
కొద్దిమాలి మముఁ గొసరీని
॥పల్లవి॥
వెన్నెతామెరలు వెదచల్లితిఁబో
కన్నులఁజూచినగతి యాయ
పున్నమవెన్నె పోఁజెరిగితిఁబో
చిన్నినవ్వనుచుఁ జెనకి నతఁడు
॥పొద్దు॥
పలుమరుఁ జిలుకలఁ బలికించితిఁబో
వలపుమాటలని వచ్చీని
అలమి జక్కవల నల్లార్చితిఁబో
అలరుఁ గుచములని అంటీని
॥పొద్దు॥
తమ్మితూఁడులను తను బిగిసితిఁబో
చిమ్ముఁగాఁగిలని చెలఁగీని
యిమ్ముల శ్రీవేంకటేశుఁడు గూడియు
నెమ్మది నావద్ద నెలకొనె నతఁడు
॥పొద్దు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము