Display:
శృంగార సంకీర్తన
రేకు: 1044-1
సంపుటము: 20-259
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఎవ్వరు సాకిరి చెప్పిరివే నీ తక్కుఁదనాలు
వువ్విళ్లూరేటి బాస లొల్లరా నేను
॥పల్లవి॥
యిందరిలో మమ్ము నింత యేల ఱట్టుసేసేవు
ముందర నెవ్వరికైనా మొక్కరా నీవు
గొందులనే వెంగేలు కొలువులో వినయాలు
యెందు నేరిచితివి ని న్నేమందు నిఁకను
॥ఎవ్వ॥
నెయ్యపు సొమ్ము నాయింట నునిచితివి తనిసితి
యియ్యరా యెవ్వరికైనా యీవులు నీవు
కయ్యము లోలోనే గారవా లిందరిలోన
కొయ్యసాదుఁ దనములు కూడునా నేఁ డిఁకను
॥ఎవ్వ॥
గక్కన నన్నింతలోనే కాఁగిలించ వచ్చేవు
యెక్కువఁ గాఁగిలించరా యేమైనా నీవు
తక్కించి శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
చక్కనాయఁ బనులెల్లాఁ జాలు నీవేసాలు
॥ఎవ్వ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము