Display:
శృంగార సంకీర్తన
రేకు: 1049-5
సంపుటము: 20-293
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఏడనున్నా నీవారమే యెరవు సేయకువయ్య
మోడామోడితనమున మొక్కేము నీకు
॥పల్లవి॥
పాయము నీ కిచ్చితిమి పంతములదానఁగాను
పోయివచ్చేమయ్యా పొద్దున నేము
కాయ మిది నీసొమ్ము కడమ నే నెఱఁగను
మాయింటికి రావయ్యా మరి చెప్పేఁగాని
॥ఏడ॥
మనసు నీ కొప్పనాయ మారుమాట లెఱఁగము
వెనక వచ్చేమయ్యా విడిదికిని
దినము నీకే సెలవు దేవరచిత్త మిఁకను
ననుఁజూడవయ్యా నవ్వు నవ్వేఁగాని
॥ఏడ॥
సేస నీపైఁ బెట్టితిమి చెప్పుకొనఁ బనిలేదు
ఆసతో నుండేనయ్యా ఆడనే నేను
బాసతో శ్రీవేంకటేశ పైకొని కూడితి విందే
వేసరక రావయ్యా వెంటఁదిప్పేఁ గాని
॥ఏడ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము