Display:
శృంగార సంకీర్తన
రేకు: 1050-2
సంపుటము: 20-296
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
అవి యేమరకుమీ అనరే మీరు
తివిరి విభుఁనిఁ దానే తెలుసుకొమ్మనరే
॥పల్లవి॥
కాయ మీడ నుందిగాని కడమదొడమ నా-
ఆయమెల్లాఁ దనచేతి దనరే మీరు
చేయి చెక్కుమీఁద నాకుచేరిన దింతేకాని
చాయఁ దనమేన గోరు చక్కఁజూడు మనరే
॥అవి॥
మాట లీడ నాడేఁగాని మనసెల్లఁ దనమీఁద
నాటియున్న దనరే నానాయకునితో
యేఁటికో నవ్వేఁగాని యెదురై తనమీఁద
కాటుకకన్నులచూపు ఘాతసేసు ననరే
॥అవి॥
అవ్వలి మోమైతిఁ గాని అదియొకబంధమున
చివ్వనఁ గూడితి నని చెప్పరే మీరు
రవ్వగా శ్రీ వేంకటేశు రతిఁ గొసరితిఁగాని
నవ్వుతానే నటించిన నాటకము లనరే
॥అవి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము