Display:
శృంగార సంకీర్తన
రేకు: 1086-4
సంపుటము: 20-514
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
నీకు నీకే కొంకనేల నెలఁత నిన్నేమనీని
చేకొని సేదదేరిచి చెక్కునొక్కరాదా
॥పల్లవి॥
సిగ్గుతోడ నున్నది చెలి నీవన్నమాటకు
యెగ్గువట్టియున్న దలయించినందుకు
నిగ్గుదేరుచున్నది నీవు చెనకినందుకు
బిగ్గెఁ గాఁగిలించి కడుఁ బెనఁగఁ గరాదా
॥నీకు॥
మోనముతో నున్నది మొక్కళపునీచేఁతకు
ఆనవెట్టుకున్న దేమో అనినందుకు
పూనిపట్టుకున్న పొందేటినీకతలకు
కానుకగా నీవే వచ్చి కలయఁగరాదా
॥నీకు॥
వఱపుపై నున్నది పంతములాడినందుకు
తఱిఁ గెరలుచున్నది తక్కినందుకు
యెఱిఁగి శ్రీ వేంకటేశ యింతలో నీవు గూడితి
జఱసి సరసముల చనవియ్యరాదా
॥నీకు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము