Display:
శృంగార సంకీర్తన
రేకు: 1086-5
సంపుటము: 20-515
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
అందుకైతే దోసము లేదంటి మింతే నేము
సందడి జాణవు నీవు సమ్మతించుకొందుగా
॥పల్లవి॥
రేయిఁబగలును నీరేపల్లెలో చేఁతలు
ఆయాలు మోవఁగా నిన్నునాడెఁగా చెలి
యీయెడనైతే నేము యింతేసికి నోపము
పాయపు వాఁడవు మాటఁబడ నోపుదువుగా
॥అందు॥
గుఱుతైన యట్టినీ కొలనిలో చేఁతలు
వెఱవక నిన్ను వెలివేసెఁగా ఆపె
తెఱవల మింతేసి తెగువకుఁ జాలము
నెఱతనీఁడ విన్నిటా నీకు నవ్వవచ్చుగా
॥అందు॥
యింపుమీర నాఁటదాని నెత్తుకవచ్చినవింద
ముంపున నీమీఁద నిట్టె మోపెఁగా ఆపె
జంపుల శ్రీ వేంకటేశ సరి నిన్నింత నేఁ జేయ
అంపక నన్నుఁ గూడితి వన్నియు నేర్తువుగా
॥అందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము