శృంగార సంకీర్తన
రేకు: 1102-1
సంపుటము: 21-7
రేకు: 1102-1
సంపుటము: 21-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
వలచినదాని కెందు వాదు చెల్లదు బలువులే చూపవయ్య బాస దప్ప దిఁకను | ॥పల్లవి॥ |
వేడుకకు వెలలేదు వెన్నెల కెంగిలిలేదు ఆడిక నీచేఁతలకు నడ్డములేదు వీడె మిందవయ్య నీవిద్యలెల్ల లోఁగొంటి వోడ కిట్టె నవ్వవయ్య వొరయ నిన్నిఁకను | ॥వల॥ |
మరునికి వేళలేదు మాయలకు గురిలేదు వరుస నీకూటాలకు వావిలేదు సరుగ మో విందవయ్య చనవెల్లఁ జేకొంటి తెరలోనికి రావయ్య తెగ నీకు నిఁకను | ॥వల॥ |
చిగురుకు చేఁగలేదు సిగ్గులకు తప్పులేదు తగు నీయాసోదానకు తనివిలేదు నిగిడి శ్రీవేంకటేశ నీవు నేనూఁ గూడితిమి మొగమెత్తి చూడవయ్య మొక్కే నేనిఁకను | ॥వల॥ |