Display:
శృంగార సంకీర్తన
రేకు: 1129-6
సంపుటము: 21-169
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళవసంతం
వద్దువద్దు అంతేసి వైతాళాలు
వుద్దండాలు సేయఁబోతే వుట్టిలేక వూఁగవా
॥పల్లవి॥
సిగ్గువడి నే నీచేతికి లోనైతినంటా
వెగ్గళించి యెమ్మెలేల వెదచల్లేవు
అగ్గలమైన నే నిన్ను అందుకు మీఱఁజూచితే
బెగ్గలి మచ్చరములే పెరుగుతానుండవే
॥వద్దు॥
మొగమోటతోడ నే నీముందర నుందాననంటా
నగుతా నీసుద్దులేల నారువోసేవు
మగటిమి నే నీకు మారుకు మారు సేసితే
చిగిరించి పంతములే చిమ్మిరేఁగవా
॥వద్దు॥
ఆసపడి నేను నీయాలనై వుందాననంటా
వాసులకు నన్నునేల వలఁబెట్టేవు
వేసరక నేనే శ్రీవేంకటేశ కూడితిని
తాసువంటివలపులు తారుమారు గావా
॥వద్దు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము