కీర్తనలు భద్రాచల రామదాసు ఇతరము లెరుగనయ్యా నాగతి నీవే శ్రీరామయ్యా ఇ..
శంకరాభరణము - ఏక (నాదనామక్రియ - ఆది)
పల్లవి:
ఇతరము లెరుగనయ్యా నాగతి నీవే శ్రీరామయ్యా ఇ..
అను పల్లవి:
సతతము సీతాపతి నీవేయని మదినమ్మితి సద్గతి జెందింపుమయ్య ఇ..
చరణము(లు):
కోపము చేయవద్దు నా కోరిక లొసగు మీ ప్రొద్దు
తాపము చెందవద్దు నా పాపము బాపు మీ ప్రొద్దు
ప్రాపుదాపు నా ప్రాణము నీవే యీ పట్టున మీ పట్టువిడువనిక ఇ..
తప్పు లెన్నవద్దంటి నా తల్లితండ్రి నీవంటి
వొప్పుల కుప్పవంటి మా యప్పవు నీ వనుకొంటి
అప్పటప్పటికి తప్పక నీవే తిప్పలబెట్టక తీర్చి దిద్దుకొను ఇ..
నా మీదను దయరాదా రామా నా మనవిని వినరాదా రామ
వేమరు నాతో వాదా నన్ను వెరవకుమీ యనరాదా రామ
ప్రేమమీర మా భద్రాచలపురి ధాముడవై రామదాసుని యేలుమీ ఇ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - itaramu leruganayyaa naagati niivee shriiraamayyaa i.. ( telugu andhra )