కీర్తనలు భద్రాచల రామదాసు ఇన్నికల్గి మీరూరకున్న నేనెవరివాడనౌదు రామ ఇ..
కల్యాణి - చాపు ( - ఆది)
పల్లవి:
ఇన్నికల్గి మీరూరకున్న నేనెవరివాడనౌదు రామ ఇ..
అను పల్లవి:
కన్నతండ్రివలె రక్షించుటకును కరుణ యేలరాదు రామ ఇ..
చరణము(లు):
అక్షయమియ్యగ దలచిన శ్రీమహా
లక్ష్మీదేవి లేదా రామా
రక్షింపగ నెంచిన భూదేవియు
రత్నగర్భగాదా రామా ఇ..
పక్షపాత మెడలింపగ చేతిలో
పరుసవేది లేదా రామా
ఈ క్షణమున దయగలిగిన సంచిత
ధనమున్నది గాదా రామా ఇ..
కనుగొని నిర్హేతుక కృప జూచిన
కల్పతరువు లేదా రామా
మనవాడని నెనరుంచిన చింతా
మణియున్నది కాదా రామా ఇ..
పెనబడు వెతదీర్పను శరణాగత
బిరుదు నీదెకాదా రామా
వనజ భవాండము లేలుదొరలు దే
వరవారలె కాదా రామా ఇ..
కరిప్రహ్లాద విభీషణాదులను
గాచితివని వింటి రామా
హర సుర బ్రహ్మాదుల కంటెను నిను
నధికుడవని యంటి రామా ఇ..
సిరినాయక నీమరుగు జొచ్చితిని
శరణంబని యంటి రామా
కరుణతో భద్రాద్రి రామదాసుని
గావు మనియంటి రామా ఇ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - innikalgi miiruurakunna neenevarivaaDanaudu raama i.. ( telugu andhra )