కీర్తనలు భద్రాచల రామదాసు ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా
నాదనామక్రియ - ఆది
పల్లవి:
ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా
నాతరమా భవసాగరమీదను నళినదళేక్షణరామా ఏ..
చరణము(లు):
శ్రీరఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నదికానుపు రామా..
మురిపెముతో నాస్వామివి నీవని ముందుగ దెల్పితి రామా
మరువక యిక నభిమానముంచు నీమరుగు జొచ్చితిని రామా ఏ..
క్రూరకర్మములు నేరకచేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారముచేయవె దైవశిఖామణి రామా ఏ..
గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా ఏ..
నిండితి నీవఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీనామము దలచిన నిత్యానందము రామా ఏ..
వాసవకమల భవాసురవందిత వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా ఏ..
వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరథీ రఘురామా ఏ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - eetiiruga nanu dayajuuchedavoo yinavaMshoottamaraamaa ( telugu andhra )