కీర్తనలు భద్రాచల రామదాసు కరుణ జూడవే ఓ యమ్మ
సౌరాష్ట్ర - త్రిపుట
పల్లవి:
కరుణ జూడవే ఓ యమ్మ
కాకుత్స్థరాముని కొమ్మ క.
అను పల్లవి:
శరణంటి ననుగానవమ్మ
జనకతనయ సీతమ్మ క..
చరణము(లు):
సరసిజాసను గన్నసాధ్వి నీమహిమలనెన్నగా
తరమే యింద్రాదులకైనా తథ్యమిది యని స్మృతులచే విన్నా క..
కలకంఠి నీ ముద్దులమోము కనుగొంటి నాదే భాగ్యము
ఎలనాగ నే నోచిననోము ఎన్న ఎవరి శక్యము ఓ యమ్మ క..
పతితపావననామ నీ భానువంశాబ్ధి సోముని
క్షితివిజయుని నేలిన ఘనుని చెలిమి చేసిన పరమకళ్యాణి క..
భద్రాద్రివాసుని కొమ్మ భద్రాద్రిశ్రీరామదాసుని కమ్మ
భద్రములొసగుమి అమ్మా భద్రం భవతు తే మాయమ్మ క..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - karuNa juuDavee oo yamma ( telugu andhra )