కీర్తనలు భద్రాచల రామదాసు గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరా
యమునాకల్యాణి - ఆది
పల్లవి:
గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరా
పరమపురుష యే వెరపులేకనీ మరుగుజొచ్చితి నరమరసేయకు గ..
చరణము(లు):
పిలువగానె రమ్మి అభయము తలపగానెయిమ్మి
కలిమి బలిమి నాకిలలో నీవని పలువరించితి నను గన్నయ్య గ..
పాలకడలి శయన దశరథబాల జలజనయన
పాలముంచు నను నీటముంచు నీ పాలబడితినిక జాలముచేయక గ..
ఏలరావు స్వామి ననునిపు డేలుకోవదేమి
ఏలువాడవని చాల నమ్మితిని ఏలరావు కరుణాలవాల హరి గ..
ఇంతపంతమేల భద్రగిరీశ వరకృపాల
చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతివై రక్షింపుము గ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - garuDagamana raaraa nanu nii karuNaneelukooraa ( telugu andhra )