కీర్తనలు భద్రాచల రామదాసు దరిశనమాయెను శ్రీరాములవారి
మేచబౌళి - త్రిపుట
పల్లవి:
దరిశనమాయెను శ్రీరాములవారి
దరిశనమాయెను దరిశనమాయెను ద..
చరణము(లు):
దరిశనమాయెను ధన్యుడనైతిని
యురమునందు సిరి మెరయుచున్నవాని ద..
శుకమునులకు యోగి ప్రభులకు నైనను
అభిముఖుడై యాననము జూపని వాని ద..
కండ క్రొవ్వున తను మరచువాని తల
చెండెదనని కోదండమెత్తిన వాని ద..
పరమభక్తుల కిల సిరులొసగెదనని
కరమున దాన కంకణము గట్టినవాని ద..
స్థిరముగ భద్రాచల రామదాసుని
అరసి బ్రోచెదనని బిరుదు దాల్చిన వాని ద..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - darishanamaayenu shriiraamulavaari ( telugu andhra )