కీర్తనలు భద్రాచల రామదాసు మరువకను నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటిని
సురటి - త్రిపుట
పల్లవి:
మరువకను నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటిని
సత్కృపను ఇక వరములిచ్చెడి స్వామివనుచును ఎందునను మీ
సరిగ వేల్పులు లేరటంచును మరిగ నే చాటుచుంటిని మ..
చరణము(లు):
రాతినాతిగ చేసినావు అజామిళునిపై కృప గలిగి ని
ర్హేతుకంబుగ బ్రోచితివి ప్రహ్లాదుని గాచితి వట సభను ద్రౌ
పతికి చీరలనొసగితివి సుంతైన నాపై దయను జూపవు మ..
లోకములు నీలోన గలవట లోకముల బాయవట నీవిది
ప్రకటముగ శ్రుతులెన్నడు చాటుట పరమ సంతోషమున వింటిని
ఇకను నీవే బ్రోవకున్నను ఎవరు నాకిక దిక్కు రామా మ..
దాసమానస పద్మభృంగ దేవసంతత చిద్విలాస
భాస సీతామానసోల్లాస భద్రశైలనివాస శ్రీరామ
దాసపోషక ఇంద్రనీల శుభాంగ పక్షితురంగ రామా మ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - maruvakanu nii divyanaama smaraNameppuDu cheeyuchuMTini ( telugu andhra )