కీర్తనలు త్యాగరాజు అతడే ధన్యుడురా; ఓమనసా!
కాపి - చాపు
పల్లవి:
అతడే ధన్యుడురా; ఓమనసా! ॥అతడే॥
అను పల్లవి:
సతతయాన సుత ధృతమైన సీతా
పతి పాదయుగమును సతతము స్మరియించు ॥నతడే॥
చరణము(లు):
వెనుకఁదీక తనమనసు రంజిల్లగ
ఘనమైన నామ కీర్తన పరుఁడైనట్టి ॥యతడే॥
తుంబురువలె తన తంబూరబట్టి ద
యాంబుధి సన్ని ధానంబున నటియించు ॥నతడే॥
సాయకు సుజనుల బాయక తాను ను
పాయమునను ప్రొద్దు హాయిగ గడపు ॥నతడే॥
ఉల్లపు తాపము చల్లజేసి యన్ని
కల్లలను యెంచి సల్లాపమున నుండు ॥నతడే॥
కరివరదుని తత్వ మెఱుఁగను మఱిగించి
అరిషడ్వర్గములందు బరవలేకఁ దిరుగు ॥నతడే॥
ఆర్తిని మఱియు బ్రవర్తినిఁ దొలగించి
కీర్తిగల్గిన రామమూర్తిని నెరనమ్ము ॥నతడే॥
కలగని నిజ విప్రకులమున జన్మించి
నిలువరమగు ముక్తిఫలమును జేకొన్న ॥యతడే॥
కర్మ నిష్టుఁడైన ధర్మశీలుఁడైన
శర్మ రామనామ మర్మము దెలిసిన ॥యతడే॥
కాసు వీసములకోసము ఆసతో
వేసము ధరియించి మోసము జెందని ॥యతడే॥
అందముగా నామ మందరు జేసిన
సుందర రామునియందు లక్ష్యము బెట్టు ॥అతడే॥
అన్ని పాటుకు సర్వోన్నత సుఖ
మున్న యనుభవించుకొన్న వాఁడెవఁడో? ॥అతడే॥
రాజస జనులతోఁ దా జతగూడక
రాజిల్లు శ్రీత్యాగరాజనుతుని నమ్ము ॥అతడే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ataDee dhanyuDuraa; oomanasaa! ( telugu andhra )