కీర్తనలు త్యాగరాజు ఇందుకా యీ తనువును బెంచిన
ముఖారి - చాపు
పల్లవి:
ఇందుకా యీ తనువును బెంచిన ॥దిందుకా॥
చరణము(లు):
నీ సేవకులేక నీకు చెంతకురాక
ఆశదాసుఁడై అటులిటుదిరుగు ॥టందుకా॥
నిరతము నీ దృష్టి నే యార్జింపక
ఒరుల భామలను ఓర జూపులు జూచు ॥టందుకా॥
సారెకు నామస్మరణము జేయక
యూరిమాట లెల్ల యూరక వదరు ॥టందుకా॥
కరములతో పూజ గావింపక డాచి
ధరలోన లేని దుర్దానములకు చాచు ॥టందుకా॥
వారము నీ క్షేత్రవరముల చుట్టక
భూరికి ముందుగా పారిపారి తిరుగు ॥టందుకా॥
నీవాఁడని పేరు నిందు వహింపక
నావాఁడని యముఁడు నవ్వుచు బాధించు ॥టందుకా॥
రావయ్య శ్రీ త్యాగరాజ వినుత నిన్ను
భావింపక ప్రొద్దు బారగొట్టుకొను ॥టందుకా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - iMdukaa yii tanuvunu beMchina ( telugu andhra )