కీర్తనలు త్యాగరాజు ఇన్నాళ్లు దయరాకున్న వైనమేమి? ఇపుడైన దెలుపవయ్య
నారాయణ గౌళ - చాపు
పల్లవి:
ఇన్నాళ్లు దయరాకున్న వైనమేమి?
ఇపుడైన దెలుపవయ్య! ॥ఇన్నాళ్ళు॥
అను పల్లవి:
చిన్న నాట నుండి నిన్నేగాని నే
నన్యుల నమ్మితినా? ఓ రామ! ॥ఇన్నాళ్ళు॥
చరణము(లు):
అలనాడు తరణి సుతార్తినిఁ దీర్పను
వలసి నిల్వగ లేదా? అదియుగాక
బలము జూపలేదా? వాని నేర
ములకుఁ దాళుకొని చెలిమిఁజేసి పద
ముల భక్తి నియ్యగ లేదా? నాయందు నీ ॥కిన్నాళ్ళు॥
ధన గజాశ్వములు దనకుఁ గలుగఁ జేయు
మని నే నిన్నడిగితినా? ఇఁక నే
కనక మిమ్మనినానా? శ్రీరామ నా
మనమున నిను కులధనముగ సం
రక్షణముఁ జేసితిగాని మరచితినా? ॥ఇన్నాళ్ళు॥
తల్లి తండ్రి యన్నదమ్ములు నీవని
యుల్లము రంజిల్లఁ బెద్దలతోను
కల్లలాడక మొల్ల సుమముల నీ
చల్లని పదములఁ గొల్లలాడుచు వెద
జల్లితిగాని త్యాగరాజునిపై నీ ॥కిన్నాళ్ళు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - innaaLlu dayaraakunna vainameemi? ipuDaina delupavayya ( telugu andhra )