కీర్తనలు త్యాగరాజు ఒరుల నాడుకోవలసినదేమి? పరమ పావన శ్రీరామ
శుద్ధసావేరి - ఆది
పల్లవి:
ఒరుల నాడుకోవలసినదేమి?
పరమ పావన శ్రీరామ ॥ఒరుల॥
అను పల్లవి:
పరితాపము తాళక మొఱలిడగా
కరుణ లేక నీవే నను జూడగ ॥ఒరుల॥
చరణము(లు):
మంచివారి సహవాసము బాసి
కొంచెపు నరుల కొఱకు నుతి జేసి
యెంచిన కార్యము గూడని గాసి స
హించ కుండెడిది నా పేరు వాసి ॥ఒరుల॥
రాశియనుచు నరులను చేబూని
వాసి యుండెడిది భవాని
ఆశప్రియ! నే ముందురాని
జేసిన కర్మ మనుకోవలెగాని ॥ఒరుల॥
దేవ త్యాగరాజ వినుత! సనక
భావనీయ! రఘుకుల తిలక!
ఈ వరకును నాదు తను వలయక
నీవే తెలుసుకోవలెగాక ॥ఒరుల॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - orula naaDukoovalasinadeemi? parama paavana shriiraama ( telugu andhra )