కీర్తనలు త్యాగరాజు కన్నతల్లి నీవు నా పాలఁగలుగ
సావేరి - ఆది
పల్లవి:
కన్నతల్లి నీవు నా పాలఁగలుగ
గాసి చెంద నేలనమ్మ క..
అను పల్లవి:
వెన్నయుండ నేతి కెవరైన
వెసనబడుదురా త్రిపురసుందరి క..
చరణము(లు):
ఎల్లవారి ధనములశ్వములు మఱి
ఎక్కువైన గట్టి మిద్దెలన్నియు
కల్లగాని కన్నవారలు
గాంచు సుఖము సున్న యనుచును
ఉల్లమునను బాగ తెలిసికొంటిని
ఊరకే ధనికల సంభాషణము నే
నొల్ల మాయలని దెలిసి రజ్జుపై
యురగబుద్ధి చెందనేల నమ్మానను క..
పలుకు మంచిగాని బాంధవులు మఱి
బావమరదులక్కలన్నదమ్ములు
కలిమిఁజూచువారు లేమిని
గనులఁగానరారు అనుచును
దలఁచుకొన్నవెనుక వారి మాయల
తగులఁజాలనమ్మా మరుమరీచి
కలను జూచి నీరని భ్రమసి
కందురా ఆదిపురవిహారిణీ నను క..
కనక భూషణములఁ బెట్టి మఱియు
సొగసుఁజేసి పాలుబోసి పెంచిన
తనువు సతము గాదు నిర్మల
తన మించుకలేదు అనుచును
అనుదిన మొనరించు సత్క్రియల నీ
కని పల్కిన త్యాగరాజరక్షకి
విను మన్నిట నీవనెఱిఁగి వేల్పుల
వేఱని యెంచుదురా త్రిపురసుందరి నను క..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kannatalli niivu naa paala.rgaluga ( telugu andhra )