కీర్తనలు త్యాగరాజు కరుణాజలధే, దాశరథే, గమనీయ సుగుణ నిధే
కేదారగౌళ - చాపు
పల్లవి:
కరుణాజలధే, దాశరథే, గమనీయ సుగుణ నిధే ॥కరుణా॥
అను పల్లవి:
తరుణాంబుజ నిభ చరణా!
సురమదహరణా! శ్రితజన శరణాద్భుతఘన! ॥కరుణా॥
చరణము(లు):
మనవిని వినక యోచన జేసిన నే
విననయ్య శ్రీరామ! ఓ పరమ పా
వన! తారక నామ! సుగుణధామ!
జనకతనయావన! చతుర్ముఖ
జనక! జనక వచన సుపరి పా
లనము జేసిన వనజలోచన!
సనకనుత! మా ధనము నీవే ॥కరుణా॥
సురముని వరనుత! సరసముతో నన్ను
కరుణించిన నీదు తండ్రి సొమ్ము
వెరవక బోనేరదు ఎందుకు వాదు?
హరిగణాధిప పరిచ! రాగమ
చర! పరాత్పర! తరముగాదిక
చరణ భక్తి వితరణ మొసగను
తరుణమిది, శ్రీకర! ధరాధిప! ॥కరుణా॥
ధనమదమున నుండు మనుజుల నేను యా
చన సేయగ లేనురా త్యాగరాజ
వినుత! ఘృణాసాగర! సమీర
తనయ సేవిత! ధనదనుత! స
జ్జన మనోహర! ఘనరవ స్వర!
మనసు చాలా వినదురా యీ
తనువు నీదని వినుతి జేసెద ॥కరుణా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - karuNaajaladhee, daasharathee, gamaniiya suguNa nidhee ( telugu andhra )