కీర్తనలు త్యాగరాజు తలచినంతనే నా తనువేమో ఝల్లనెరా
ముఖారి - ఆది
పల్లవి:
తలచినంతనే నా తనువేమో ఝల్లనెరా ॥తలచి॥
అను పల్లవి:
జలజవైరి ధరాది విధీంద్రుల
చెలిమి పూజలందిన నిను నే ॥తలచి॥
చరణము(లు):
రోటికిఁ గట్ట దగిన నీ లీలలు
మూఁటి కెక్కువైన నీదు గుణములు
కోటి మదన లావణ్యములైన
సాటిగాని నీ దివ్యరూపమును ॥తలచి॥
నిద్రాలస్య రహిత శ్రీరామ
భద్రానిలజ సులభ సంసార
చిద్రార్తిని దీర్చు శక్తిని విధి
రుద్రాదుల నుతమౌ చరితంబును ॥తలచి॥
పాద విజత ముని తరుణీ శాప
మోద త్యాగరాజ వినుత ధరాప
నాద బ్రహ్మానంద రూప
వేదసారమౌ నామధేయమును ॥తలచి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - talachinaMtanee naa tanuveemoo jhallaneraa ( telugu andhra )