కీర్తనలు త్యాగరాజు నన్ను విడిచి కదలకురా - రామయ్య వదలకురా
రీతిగౌళ - చాపు
పల్లవి:
నన్ను విడిచి కదలకురా - రామయ్య వదలకురా ॥న॥
అను పల్లవి:
నిన్నుబాసి యర నిమిషమోర్వనురా ॥న॥
చరణము(లు):
అబ్ధిలో మునిగి శ్వాసమును బట్టి - యాణిముత్యము గన్నట్లాయె శ్రీరమణ ॥న॥
తరముగాని యెండవేళ గల్ప - తరునీడ దొరికి నట్లాయె నీవేళ ॥న॥
వసుధను ఖననము జేసి ధన - భాండ మబ్బినరీతి గనుగొంటి డాసి ॥న॥
బాగుగ నన్నేలుకొమ్ము యల్ల - త్యాగరాజనుత తనువు నీ సొమ్ము ॥న॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nannu viDichi kadalakuraa - raamayya vadalakuraa ( telugu andhra )