కీర్తనలు త్యాగరాజు నిన్నే నెరనమ్మినాను నీరజాక్ష నను బ్రోవుము
ఆరభి - చాపు
పల్లవి:
నిన్నే నెరనమ్మినాను నీరజాక్ష నను బ్రోవుము ॥నిన్నే॥
అను పల్లవి:
కన్నకన్న వారిని వేడు కొన్నాను ఫలములేదని నే ॥నిన్నే॥
చరణము(లు):
దార తనయుల యుదర
పూరణము సేయు కొఱకు
దూరదేశములను సంచారము జేసి
సారమింతెన లేక వేసారి యీ సం
సార పారావారమందు గలుగు ఫలమీ
దారియని తెలిసి రామ ॥నిన్నే॥
సంచిత కర్మము తొల
గించి నన్నే వేళ కరు
ణించి బ్రోచు దైవము నీవనుచు యా
చించి కొంచెపు నరుల నుతి
యించను నావల్లను గాదంచును దుస్సంగతి చా
లించి సంతతము రామ ॥నిన్నే॥
భూతలమున నొక్కరి
చేతి ధన మపహరించు
ఘాతకులఁ బరలోక భీతియు లేని
పాతకుల బట్టి యమ
దూతలు గొట్టెడి వేళ
బ్రోతునని పల్క నెవరి చేత గాదని శ్రీరామ ॥నిన్నే॥
ఎందు నిండియుండు రఘు
నందన వేగ నా మనసు
నందు దలచిన యంతా నందమై తోచి
సుందర వదన యోగి
బృంద వందిత పాదార
వింద యుగ త్యాగరాజ వందనీయ సంతతము ॥నిన్నే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ninnee neranamminaanu niirajaaxa nanu broovumu ( telugu andhra )