కీర్తనలు త్యాగరాజు నీవు బ్రోవవలెనమ్మ నను, నిఖిలలోకజననీ
సావేరి - ఆది
పల్లవి:
నీవు బ్రోవవలెనమ్మ నను, నిఖిలలోకజననీ ॥నీవు॥
అను పల్లవి:
దేవి! శ్రీధర్మసంవర్ధని దివ్య దర్శన మొసగి సంతతము ॥నీవు॥
చరణము(లు):
నీవలె కరుణాసాగరి యీ జగాన
నే వెతకి కనుగొనగా నెక్కడ గాన
పావనమగు శ్రీమత్పంచ నదీశ్వరుని రాణి నా
భావములో దొరకుకొంటివి యిక మరచెదనా?
యీ వరకును జేసిన నేరములను
నీ వెంచక నలుగురిలో తన కిక
కావలసిన కోరిక లొసంగి
కావుము పతితపావని ధర్మ సంవర్ధని ॥నీవు॥
నాయెడ వంచన సేయక పసిడి శిలాకంజ
సాయకు నన్నిట నీవని యెంచితి గాక
మాయవు భవసాగర బాధలు యెందాక యెడ
బాయని నీ పద భక్తి నొసంగ పరాకా?
కాయజ జనకుని సోదరి నీయొక్క
మాయలను తొలగజేయక యుండుట
న్యాయము గాదు దయాపరి శుభఫల
దాయకియౌ ధర్మ సంవర్ధని ॥నీవు॥
రాజశిఖామణి సతియయిన శుభాకారి అంబ
రాజరాజేశ్వరి త్రిజగదాధారి స
రోజనయని నీ మహిమలను తెలియలేరే త్యాగ
రాజది పరమభాగవత హృదయాగారె
యీ జగతిని గౌరి పరాత్పరి అ
వ్యాజమునను పరిపాలన జేయు
ఓ జగదీశ్వరి నెరనమ్మితి నిను
రాజిగా ధర్మ సంవర్ధని ॥నీవు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niivu broovavalenamma nanu, nikhilalookajananii ( telugu andhra )