కీర్తనలు త్యాగరాజు పాహి కల్యాణ సుందరరామ మాం పాహి కల్యాణ సుందర రామ
పున్నాగవరాళి - చాపు
పల్లవి:
పాహి కల్యాణ సుందర రామ మాం
పాహి కల్యాణ సుందర రామ మాం ॥పాహి॥
చరణము(లు):
చదివిన వాఁడనుగాను రామ
ఇది బుద్ధియనుచు తెలియలేను ॥పాహి॥
భజియించుటకు బుద్ధిలేక రామ
బతిమాలి తిరిగితి యిందాక ॥పాహి॥
దినదిన ముదరముకొఱకై రామ
ధనికుల గాచితిని యీవరకు ॥పాహి॥
ఆలు సుతులపైని ప్రేమ నీ ప
దాల నుంచనైతి రామ ॥పాహి॥
సంసార సుఖము సత్యమని నామ
సార మెఱుఁగ మరిచితిని ॥పాహి॥
విషయసుఖాదుల రోయలేక
విర్రవీగి మోసమాయె ॥పాహి॥
శుకసన్నుత నన్ను కన్నతండ్రి
యొకసారి శరణనుకొంటి ॥పాహి॥
తమ్మికన్నుల రఘువీర నిను
నమ్మిన నన్నేలుకోరా ॥పాహి॥
నేరమెంతో జేసినాను యేమి
నేరమనుచు వేడినాను ॥పాహి॥
నిను నమ్మువారిదే మేలు
నీపాదసేవ వెయివేలు ॥పాహి॥
సాకేత రామ నామీద దయ
లేకుండుటకు మరియాద ॥పాహి॥
శరణ్య కోసలరాజ రామ
పరిపాలిత త్యాగరాజ ॥పాహి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paahi kalyaaNa suMdararaama maaM paahi kalyaaNa suMdara raama ( telugu andhra )