కీర్తనలు త్యాగరాజు పాహి రామచంద్ర రాఘవ హరే మాం
యదుకుల కాంభోజి - త్రిశ్రలఘు
పల్లవి:
పాహి రామచంద్ర రాఘవ హరే మాం
పాహి రామచంద్ర రాఘవ పా..
అను పల్లవి:
జనకసుతారమణ కావవే గతి నీవు
గనుక నన్ను వేగఁ బ్రోవవే పా..
చరణము(లు):
ఎంత వేడుకొన్న నీకు నాయందు యిసు
మంత దయలేక యుండునా పా..
కష్టములను దీర్పమంటిని నీవు నా
కిష్టదైవ మనుకొంటిని పా..
శోధనలకు నేను బాత్రమా రామ య
శోధనులకు నుతి పాత్రమా పా..
ఆటలనుచుఁ దోచియున్నదో లేక నా ల
లాట లిఖిత మర్మమెట్టిదో పా..
అంబుజాక్ష వేగఁ జూడరా నీ కటా
క్షంబులేని జన్మమేలరా పా..
నీవు నన్నుఁజూడవేళరా నీ కన్న కన్న
తావుల నేవేడఁ జాలరా
నన్నుఁ బ్రోచువారు లేరురా రామ నీ
కన్న దైవమెందు లేదురా పా..
రాజరాజపూజిత ప్రభో హరే త్యాగ
రాజరాజ రాఘవ ప్రభో పా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paahi raamachaMdra raaghava haree maaM ( telugu andhra )