కీర్తనలు త్యాగరాజు ప్రొద్దుపోయెను శ్రీరాముని బూని భజింపవే మనసా
తోడి - చాపు
పల్లవి:
ప్రొద్దుపోయెను శ్రీరాముని బూని భజింపవే మనసా ॥ప్రొద్దు॥
అను పల్లవి:
నిద్దుర చేత కొన్నాళ్ళు విషయ
బుద్ధులచేత కొన్నాళ్ళు ఓమనసా ॥ప్రొద్దు॥
చరణము(లు):
ప్రొద్దున లేచి త్రితాపములను నరుల
బొగడి పొగడి కొన్నాళ్ళు పట్టి
ఎద్దురీతి కన్న తావుల భుజియించి
యేమి తెలియక కొన్నాళ్ళు
ముద్దుగతోచు భవసాగరమున
మునిగితేలుచు కొన్నాళ్ళు
పద్దుమాలిన పామర జనులతో వెఱ్ఱి
పలుకులాడుచు కొన్నాళ్ళు ఓ మనసా ॥ప్రొద్దు॥
ముదమున ధన తనయాకారములు జూచి
మదముచేత కొన్నాళ్ళు అందు
చెదరినయంత శోకార్ణవగతుఁడై
జాలిఁ జెందుటయు కొన్నాళ్ళు
ఎదటిపచ్చజూచి తాళలేక తా
నిలను దిరుగుట కొన్నాళ్ళు
ముదిమది దప్పిన వృద్ధతనముచే
ముందువెనుక తెలియకయె కొన్నాళ్ళు ॥ప్రొద్దు॥
యాగాది కర్మములను జేయవలెనని
యలసటచేత కొన్నాళ్ళు అందు
రాగలోభములతో నపరాధముల జేసి
రాజసమున కొన్నాళ్ళు
బాగుగ నామకీర్తనములు సేయుట
భాగ్యమనక కొన్నాళ్ళు
త్యాగరాజనుతుఁడైన శ్రీరాముని
తత్వము తెలియకయే కొన్నాళ్ళు ॥ప్రొద్దు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - proddupooyenu shriiraamuni buuni bhajiMpavee manasaa ( telugu andhra )