కీర్తనలు త్యాగరాజు మున్ను రావణు బాధ నోర్వక విభీషణుడు మొఱబెట్టగా
తోడి - ఝంప
పల్లవి:
మున్ను రావణు బాధ నోర్వక విభీ
షణుడు మొఱబెట్టగా రామచంద్ర ॥మున్ను॥
అను పల్లవి:
మన్నింతుననుచు కులబిరుదులను పొగడిన
మాటల మరిచితివొ శ్రీరామచంద్ర ॥మున్ను॥
చరణము(లు):
మును వజ్రబాధల నోర్వజాలకను
ఇనజుండు నిను రామచంద్ర
కొనియాడ పరితాపమున జూచి
వాని మదికొదవ దీర్చిన రామచంద్ర ॥మున్ను॥
మును హేమకశిపు బాధల సహింపగలేక
మురహరియన రామచంద్ర
చనువుతో ప్రహ్లాదు సంతాప
మును దీర్చి సౌఖ్య మొసగిన రామచంద్ర ॥మున్ను॥
మున్ను నీ మహిమ నే విన్నదేగాని స
న్మునివంద్య శ్రీరామచంద్ర
పన్నగాధిప శయన పాలించి నా వెతలు
పరిహరింపవే రామచంద్ర ॥మున్ను॥
రాజరాజ విరాజవాహ రవికులజలధి
రాజ రాఘవ రామచంద్ర
రాజీవనేత్ర భవస్తుత త్యాగ
రాజ వందిత రామచంద్ర ॥మున్ను॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - munnu raavaNu baadha noorvaka vibhiiShaNuDu moRabeTTagaa ( telugu andhra )