కీర్తనలు త్యాగరాజు రమారమణ! భారమా? నన్ను బ్రోవుమా, శ్రీకర!
వసంతభైరవి - ఆది
పల్లవి:
రమారమణ! భారమా? నన్ను బ్రోవుమా, శ్రీకర! ॥ర॥
అను పల్లవి:
పుమానుఁడని గాదని నాతో దె
ల్పుమా, నరోత్తమా! సమానరహిత! ॥ర॥
చరణము(లు):
సరి నీ కెవ్వరు దొరకరని గర్వము
అదియుగాక ధరలో జనులు మర్మ
మెఱిఁగి నమ్ముకోలేరంటి, ధర్మాది
మోక్ష వరము లొసంగి భక్త
వరుల గాఁచిన కీర్తి వింటి, మఱిమఱి
నన్నిందరిలోఁ జెయిబట్టి బ్రోవ
శరణు జొచ్చితినయ్య, దరి నీవను
కొన్నాను, చరణమే గతియంటి ॥ర॥
స్మరణ దెలిసి యేలు పరమాత్ముఁడు
నీవేయన్నాను, పామరులతో,
సరిబోయినటుల నీ గోచరములనే
బల్కుకొన్నాను, నా మాటలెల్ల
కరుణతో నిజము జేయ, వరదా!
దండము లిడినాను, శ్రీరామరామ!
పరమపావననామ! నీరజలోచన! నన్నా
దరణ జేయుటకింత కరువైన వితమేమి? ॥ర॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ramaaramaNa! bhaaramaa? nannu broovumaa, shriikara! ( telugu andhra )