కీర్తనలు త్యాగరాజు వాఁడేరా దైవము మనసా
పంతువరాళి - ఆది
పల్లవి:
వాఁడేరా దైవము మనసా ॥వా॥
అను పల్లవి:
ఆడిన మాటలు తప్పఁ డనుచును
ఆచంద్రార్కముగ కీర్తిగల్గిన ॥వా॥
చరణము(లు):
దండి రక్కసుల మదమణఁచను ఆ
ఖండలాది సురకోటులను భూ
మండల సుజనులఁ బాలింపను గో
దండపాణి రూపముతో వెలసిన ॥వా॥
దారితెలియలేని అజ్ఞులకు భవ
నీరధి దాటి మోక్షమందుటకు
నీరజారిధరుఁ డుపదేశించే
తారక నామముతోను వెలసిన ॥వా॥
ధాతృ వినుతుఁడైన త్యాగరాజుని
చేతి పూజలంది బాగుగ ప్ర
ద్యోతనాన్వయమునను జనించి
సీతాపతియని పేరుకలిగిన ॥వా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vaa.rDeeraa daivamu manasaa ( telugu andhra )