కీర్తనలు త్యాగరాజు వేంకటేశ నిను సేవింపను పది
మధ్యమావతి - ఆది
పల్లవి:
వేంకటేశ నిను సేవింపను పది
వేల కనులు కావలెనయ్య వేం..
అను పల్లవి:
పంకజాక్ష పరిపాలిత మునిజన
భావుకమగు దివ్యరూపమును కొన్న వేం..
చరణము(లు):
ఎక్కువ నీవని దిక్కులఁ బొగడఁగ
అక్కఱగొని మది సొక్కి కనుంగొన
నిక్కము నీవె గ్రక్కునఁ బ్రోవు త
ళుక్కని మెఱసే చక్కతనముగల వేం..
ఏ నోము ఫలమో నీ నామామృత
పానము అను సోపానము దొరికెను
శ్రీనాయక పరమానంద నీ సరి
గానము శోభాయమానాంఘ్రులుగల వేం..
యోగిహృదయ నీవే గతియను జన
భాగధేయ వరభోగీశశయన
భాగవతప్రియ త్యాగరాజనుత
నాగాచలముపై బాగుగ నెలకొన్న వేం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - veeMkaTeesha ninu seeviMpanu padi ( telugu andhra )